అపర రామదాసు – వాసుదాసు
సుమారు 500 సంవత్సరాల క్రితం భద్రాచలంలో శ్రీరామచంద్ర ప్రభువుకు గుడి కట్టించి, ఆభరణాదులు చేయించి “రామదాసు” గా ప్రఖ్యాతి గాంచిన గోపన్న వలె, ౧౦౦ సంవత్సరాల క్రితం కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ పునరుద్ధరణ గావించి, ఆభరణ వాహనాదులు చేయించి ‘వాసుదాసు’ గా ప్రస్తుతి నొందిన వారు శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు.
శ్రీ సుబ్బారావు తేదీ 23-01-1863 కు సరియగు దుందుభి నామ సంవత్సర మాఘ శుద్ధ చవితిన కడప జిల్లా జమ్మలమడుగు నందు భారద్వాజస గోత్రీకులైన శ్రీ వావిలికొలను రామచంద్ర రావు, శ్రీమతి కనకమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించారు. వీరి స్వస్థలం కడప పట్టణంలోని మోచముపేట. శ్రీ సుబ్బారావునకు ౧౧ వ ఏటనే పితృవియోగము సంభవించగ, పినతండ్రి లక్ష్మణరావు పెంచి పెద్దచేసి విద్యాభ్యాసమునకు సహకరించిరి. ఉదరపోషణార్ధం ఎఫ్.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులైన తదుపరి ప్రొద్దుటూరు తాలూకా కార్యాలయములో డిస్పాచింగ్ క్లర్క్గా ఉద్యోగములో ప్రవేశించిరి. డిపార్టుమెంటు పరీక్షలలో కృతార్థులై రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిరి. శ్రీవారికి 21 వ ఏట కడప జిల్లా చిట్వేలు మండలములోని కంప సముద్రము అగ్రహార వాస్తవ్యులైన శ్రీ చేట్లూరి నరసింహాచార్యుల వారు సుబ్బారావు గారి వద్దకు వచ్చి శ్రీరామ షడక్షరీ మంత్రము నుపదేశించిరి. గోపన్నకు కూడా కబీరు మహాశయుడు ఆయన వద్దకు వచ్చియే తారక మంత్రముపదేశించారు కదా. పినతండ్రి లక్ష్మణరావు రామాయణమును సుబ్బారావుకు ఉపదేశం చేయటం జరిగింది. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుచునే రామాయణ పారాయణ, మంత్రానుష్ఠానములను సుబ్బారావు నియమ నిష్ఠలతో నిర్వహించెడివారు. తత్ఫలితముగా శ్రీ రామచంద్రమూర్తి దివ్య కరుణా కటాక్షము సుబ్బారావుగారిపై ప్రసరించి వారికి కవిత్వ రచనా శక్తి సహజముగా కలిగెను.
ఉద్యోగము - గ్రంథ రచన
శ్రీవారు కడపజిల్లా రాజంపేట రెవిన్యు ఇన్స్పెక్టర్ గా పనిచేయు చున్నప్పుడు ప్రప్రథమముగా మన్మధుని చరిత్రయను “శ్రీ కుమారాభ్యుదయము అనే జటిల కావ్యమును రచించి ప్రచురించిరి. కావ్యావిష్కరణ నెల్లూరు టౌనుహాలులో జరగగా ఆ సభకు వచ్చినవారే రెవిన్యు ఉద్యోగి క్లిష్టాన్వయ సమన్విత పద్య కావ్యమును వ్రాయుటయా? అని సంశయము వ్యక్త పరచ వారెల్లరూ ఆశ్చర్యచకితులగునట్లు నెల్లూరు రంగస్వామిపై ఆశువుగా 108 పద్యములు చెప్పిరి. తదుపరి అవి “తల్వగిరి రంగనాయక శతకము” గా వ్యాప్తి లోకి వచ్చినవి.
దైవేచ్చనేరున్గుట ఎవరితరమూ కాదు! శ్రీ సుబ్బారావు ఆక్టింగ్ తహసీల్దారుగా పనిచేయుచున్నప్పుడు వారికి శ్వాస (క్షయ) వ్యాధి ఏర్పడి యెన్నివిధముల వైద్య చికిత్సలు చేయించిననూ వ్యాధి తగ్గక జీవించుట దుర్లభమని నిర్ణయింపబడుట వలన తమ ఉద్యోగమునకు రాజీనామా చేసిరి. ‘నన్నేమియా’ అను యునాని వైద్యుని చికిత్సకు శ్రీ రామానుగ్రహము తోడై అచిరకాలములోనే వారు స్వస్థత నొందిరి. పున: ఉద్యోగాన్వేషణలో శ్రీ సుబ్బారావుగారు మిత్రుడు శ్రీ కొత్తపల్లె పద్మనాభరావు సహకారముతో మద్రాసులోని హైందవోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా 1904 లో చేరి అనతికాలంలోనే ప్రెసిడెన్సీ కళాశాలలో అంగ్లోప న్యాసకులైరి. ౧౯౨౦ లో పదవీ విరమణ పొందువరకూ అనేక గ్రంథములు రచించిరి. శ్రీ మద్వాల్మీకి మహర్షి విరచిత సంస్కృత రామాయణమునకు ఆంధ్రీకరణములుగా నుండిన మొల్ల రామాయణము, భాస్కర రామాయణము, రంగనాథ రామాయణము, గోపీనాథ రామాయణము మున్నగునవి యథాతథ అనువాదములు గావని శ్రీ సుబ్బారావు గారు భావించి నాలుగు సంవత్సరములు శ్రమించి 24,000 శ్లోకములకు 24,000 పద్యముల అనువాదముతో రామాయణమును రచించి క్రీ.శ. 1908వ సంవత్సరమున కడప జిల్లా ఒంటిమిట్టలోన శ్రీకోదండరామునికి అంకితమిచ్చిరి. ఆ సభకు విచ్చేసిన పండితులు గ్రంథము నామూలాగ్రము పరిశీలించి వారికి ‘ఆంధ్ర వాల్మీకి’ బిరుదునొసంగిరి. వారి రామాయణము ఆంధ్రవాల్మీకి రామాయణముగా ప్రసిద్ధి కెక్కినది.
ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధరణ
ఉద్యోగ కాలములోనే వారికి సతీ, సుతుల వియోగము కలిగి ఉద్యోగ విరమణనాన౦తరము విరాగులై భగవద్ధ్యానపరులై ‘ఘటికాచలము’న (తిరుత్తణి సమీపమున వున్నది) తపస్సు గావించుచుండిరి. కొన్ని నెలల తరువాత వారిని కడపజిల్లా సిద్దవట తహసీల్దార్ శ్రీ జయరామా నాయుడుగారు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయమును పునరుద్ధరించి శాశ్వత నిత్య ధూప దీపారాధనలకు చర్యలు చేపట్టవలసినదిగా ఆహ్వానించిరి. తపో, యోగ మార్గాలకంటే భగవంతుని భక్తి మార్గము ద్వారా చేరుట సులభతర మార్గమని శ్రీ సుబ్బారావు తలచి తానూ ఒంటిమిట్ట చేరుకొనుచున్నట్లు తహసీల్దార్ కు వర్తమానం పంపారు. క్రీ.శ. 1920లో దేవాలయ పునరుద్ధరణ నిమిత్తము మిత్రుడు ముడుపిరి సుబ్బారాయుడు ఱంపముతో టెంకాయను కోసి కమండలాకృతిగా చేసి యిచ్చిన ‘టెంకాయ చిప్ప’ను చేత పట్టుకొని శ్రీ సుబ్బారావుగారు ‘రామ భిక్షాందేహి ఓ అయ్యలారా! ఓ అమ్మలారా! అని స్వీయ రచిత కీర్తనను అలాపించుచు ఆంధ్ర రాష్ట్రములోని అనేక గ్రామాలు, పట్టణాలు, భక్త మిత్ర బృ౦దముతో పర్యటించి అనేక వేల రూపాయలు పోగుచేసి దేవాలయ పునరుద్ధరణ గావించిరి. అంతియేగాక శ్రీ సీతా రామ లక్ష్మణులకు ఆభరణములు శేష గరుడ అశ్వాది వాహనములు రథము, రథశాల నిర్మింపజేశారు. ఇంకనూ నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, త్రైమాసికోత్సవ, షాణ్మాసికోత్సవ, సంవత్సరోత్సవాదులు యథా శాస్త్రీయంగా జరుగునట్లుగా ఏర్పాటు గావించిరి. దేవాలయ పునరుద్ధరణకు సంచారము గావించునప్పుడు వారు ‘వాసుదాసు’ గా (భగవంతుడైన వాసుదేవునకు దాసుడని అర్థము) ప్రసిద్ధి కెక్కుటయే గాక అనేకమంది శిష్యులకు మంత్రోపదేశాదులు గావించి వారి హృదయములలో వాసుదాసు స్వామిగా పూజలందుకొనిరి. శిష్యుల కోరిక మేరకు 69వ యేట క్రీశ.1932లో రోజుకు 20 గంటలు శ్రమించి తాము రచించిన ‘ఆంధ్ర వాల్మీకి రామాయణము’ నకు వ్యాఖ్యానమును ‘మందరము’ అను పేర రచించి పండిత పామరుల ప్రశంసలనందిరి. మందర వ్యాఖ్యాన రచనకు పూర్వంగముగా ఆసేతు, హిమాచల పర్యన్తముగల దాదాపు 550 నదీ, నదముల నుండి తీర్థము తెప్పించి శ్రీ రామచంద్ర ప్రభువునకు పట్టాభిషేకము గావించి వాసుదాసుడు కృతార్థు డయ్యెను. ఒంటిమిట్ట దేవాలయములో శ్రీ సుబ్బారావుగారు “ఆంధ్ర వాల్మీకి రామాయణమంకితము’, వాసుదాస స్వామిగా ‘పట్టాభిషేకము’ ఒనరించిన విషయములను తెలుపు శిలాఫలకములు ఇప్పటికినీ ఉన్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధరణకు శ్రీ సుబ్బారావు గారు ఉపయోగించిన టెంకాయ చిప్ప ఒకటి ఇప్పటికినీ గుంటూరు జిల్లా తెనాలి పట్టణమునకు 5 km దూరమున గల అంగలకుదురు గ్రామములోని శ్రీకోదండరామ సేవక ధర్మ సమాజము నందలి పూజామందిరము నందు భద్రపరచబడి యున్నది. శ్రీ వారు రామ కైంకర్యమునందు టెంకాయ చిప్పను ప్రస్తుతించుచు, దానిపైనొక పద్యము ఇట్లు పేర్కొనిరి.
తే.గీ. ‘ఆంధ్ర వాల్మీకి’ హస్తంబు నందు నిలచి
రూప్యములు వేనవేలుగ ప్రోగు చేసి
దమ్మిడైనను దానిలో దాచికొనక
ధరణిజాపతి కర్పించి ధన్యవైతి
కలదె నీకంటె గొప్పటెంకాయ చిప్ప
శ్రీ సుబ్బారావు గారు తేదీ. 01-07-1936కు సరియగు ధాత శ్రావణ శుద్ధ చతుర్దశినాడు పాంచభౌతిక శరీరమును విడచి పరమపదము చేరారు. రామదాసు గారి లాగానే రెవిన్యు డిపార్టుమెంటు తహసీల్దార్ గా పనిచేసి భద్రాచల రామాలయము రీతి ఒంటిమిట్ట కోదండ రామాలయమును పునరుద్ధరించి యశ: కాములైన ఆంధ్రవాల్మీకి శ్రీ వాసుదాసుగారు ప్రాత: స్మరణీయులు.
(శ్రీ రామానుజ దాస స్వామి, అంగలకుదురు-522 201, గుంటూరు జిల్లా)
మిత్రులకు మనవి. ఈ రోజు నా బ్లాగ్లో అపర రామదాసు - వాసుదాసు అనే పోస్టింగు వేశాను. వీలు వెంట చూడగలరని మనవి. వారి మందరము-ఆంధ్ర రామాయణము 24,000 శ్లోకాలకు 24,000 పద్యాలూ వ్యాఖ్యాసహితముగా అచ్చు వేశారు. నేను సుందర కాండ, అరణ్యకాండ కొద్దిగా చదివాను. ఆ పుస్తకాలు పద్యరచన మీద ఆసక్తి వున్నవారు చదవ దగ్గవి. తెనాలి దగ్గర వారి ఆశ్రమమునకు వెళ్ళినపుడు అక్కడి స్వామీజీ కోరిక మేరకు నేను నా బ్లాగులో ఈ పుస్తక సమాచారము పెట్టటం జరిగింది. వారికి ఇంటర్నెట్, కంప్యూటర్ ప్రపంచం తెలియదు. ఏదో నావంతు సహాయంగా చేస్తున్న కృషి. అంతే.
అవునండీ. అయోధ్య, యుద్ధ కాండలు ఒక్కొక్కటీ రెండు భాగాలుగా వున్నాయి. వివరాలు:
మందరము-టీకా తాత్పర్య వ్యాఖ్యాన సహితము
1. బాల రూ. 250.00
2. అయోధ్య - ఒకటవ భాగం - రూ. 225.00
3. అయోధ్య - రెండవ భాగం - రూ. 225.00
4. అరణ్య రూ. 225.00
5. కిష్కింధ రూ. 225.00
6. సుందర రూ. 250.00
7. యుద్ధ - ఒకటవ - రూ. 225.00
8. యుద్ధ - రెండవ - రూ. 225.00
9. ఉత్తర - 225.00
మూలము - పద్యములు మాత్రము.
1. బాల - రూ. 45.00
2. అయోధ్య -స్టాకు లేదు (మే, 2008 తేదీనాటికి, ప్రస్తుతం వుండవచ్చు)
౩. అరణ్య -స్టాకు లేదు
4. కిష్కింధ - రూ.30.00
5. సుందర - రూ.50.00
6. యుద్ధ - స్టాకులేదు
7. ఉత్తర- రూ. 30.00
దొరకు చోటు: అంగలకుదురు, తెనాలి దగ్గర, గుంటూరు జిల్లా 522 211
ఫోను: 08644-230690; cell: 93900-97195
VPP facility is available for anywhere in India.
మందరము-టీకా తాత్పర్య వ్యాఖ్యాన సహితము
1. బాల రూ. 250.00
2. అయోధ్య - ఒకటవ భాగం - రూ. 225.00
3. అయోధ్య - రెండవ భాగం - రూ. 225.00
4. అరణ్య రూ. 225.00
5. కిష్కింధ రూ. 225.00
6. సుందర రూ. 250.00
7. యుద్ధ - ఒకటవ - రూ. 225.00
8. యుద్ధ - రెండవ - రూ. 225.00
9. ఉత్తర - 225.00
మూలము - పద్యములు మాత్రము.
1. బాల - రూ. 45.00
2. అయోధ్య -స్టాకు లేదు (మే, 2008 తేదీనాటికి, ప్రస్తుతం వుండవచ్చు)
౩. అరణ్య -స్టాకు లేదు
4. కిష్కింధ - రూ.30.00
5. సుందర - రూ.50.00
6. యుద్ధ - స్టాకులేదు
7. ఉత్తర- రూ. 30.00
దొరకు చోటు: అంగలకుదురు, తెనాలి దగ్గర, గుంటూరు జిల్లా 522 211
ఫోను: 08644-230690; cell: 93900-97195
VPP facility is available for anywhere in India.
కొందఱు కారణ జన్ములు. ఆ టెంకాయ చేసుకొన్న పుణ్యము, వాసుదాసుల ఫాణికి యలంకృతమైనది.
రిప్లయితొలగించండివావికొలను సుబ్బారావుగారి జీవితివిశేషాలను పంచినందుకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండిmee vanti pathakulu dorikitam maa adrushtam.
రిప్లయితొలగించండిశ్రీ చంద్రశేఖర్ గారికి
రిప్లయితొలగించండినమస్కారం!
మీ వ్యాసం తెలుగు భాషకు, సాహిత్యానికి మఱచిపోలేని సేవచేసిన ఆ మహామహుని అజరామరమైన యశోమూర్తికి భక్తిపూర్వకమైన నివాళిగా భాసిస్తున్నది.
శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు ఆ తర్వాత "టెంకాయచిప్ప" శతకమును వ్రాసి ప్రకటించారు. అందులో తమ ఉద్యంలో ఎదుర్కొన్నా సాధకబాధకా లన్నింటినీ సవిస్తరంగా పేర్కొన్నారు.
సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు